24, జనవరి 2022, సోమవారం

సుద్దాల అశోక్ తేజ ‘అడివి’ ఆత్మకథాకావ్యం

 ‘నేను మరణంతో కరచాలనం చేస్తున్న తరుణంలో కూడా నా భావోద్వేగాలు అరణ్యం చుట్టూనే ఉండడం నేను పునర్జీవితుణ్ణి కావడానికి దోహదమైంది.’

తాను రాసిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ వచనరూప కవిత్వం భూమికలో రాసిన మాటలవి.
ఇటీవల అశోకన్న(సుద్దాల అశోక్ తేజ) కొత్త కావ్యం అచ్చయి వచ్చింది.
168 పేజీల ఈ పుస్తకం పర్యావరణ ఉద్యమానికి ఒక కావ్యపతాకం...
తన పుస్తకానికి నాతో చిన్న సమీక్షవంటిది రాయించుకున్నాడు అశోకన్న....
ఆ నాలుగు మాటలు మీతో పంచుకుందామని........

సుద్దాల అశోక్ తేజ ‘అడివి’ ఆత్మకథాకావ్యం:
‘‘ప్రకృతి ఆలోచనాకృతి
కృతిగా శ్రుతిస్తున్న’’---అశోక్ తేజ
మనిషి తక్షణ కర్తవ్యం ప్రకృతిని కాపాడుకోవడమే. అంతులేని మనుషుల కోరికల ఉద్రేకాలకు ప్రకృతి శిథిలమైపోతున్నది. కోట్ల సంవత్సరాల వయస్సున్న భూమి లక్షలేండ్ల వయస్సున్న కుబ్జమానవుల ఉన్మాద క్రతువులకు భయకంపితమై పోతున్నది. మనుషులు తమ అవసరాలకు మించిన వినియోగతత్వం(utilitarian attitude)తో వస్తూత్పత్తికోసం చేస్తున్న పనుల కారణంగానే ప్రాకృతిక వనరులన్నీ(resources) ‘ధ్వంసనచణ, హింసనచణ’ పాలైపోతున్నాయి. ప్రస్తుతం మనిషి తనచేష్టల ఫలితంగానే ఒక విలయ విషవలయం(vicious circle)లో విలవిలలాడుతున్నది.
బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలేనన్నాడు. కాని, మనిషిపుడు కోరికలతోనే గుర్తుపట్టే ఎరుకౌతున్నది. ఎవరెక్కువ కోరికలు పెంచుకోగలరో, తీర్చుకోగలరో వారే Great. కోరికలపోటీలో గెలిచినవారే, బహుళార్థసాధక వినియోగ ఉత్పత్తులు పొందగలిగినవారే Greater Earth Human beings. భూమ్మీదే కాదు గ్రహాలమీద కూడా ఉత్పత్తుల కార్ఖానాలు నాటగలిగినవారే Greatest Modern Adventurists. ఎక్కడిదాకా...ఎప్పటిదాకా..ఈ విషాద, ప్రమాద ప్రయాణం మనిషికి. ప్రమాదకరమైన వినియోగం, పర్యావరణ వినాశనం బాటలో కొనసాగే మనిషి ఉద్రేకాన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధుని ‘సునఖ్ఖత సుత్తం’ ఒక తొవ్వ అంటాడు ఆండ్రూ ఓలెంజుకి.
పర్యావరణ నాశనం, జీవవైవిధ్యనష్టం, అనిశ్చిత వికాసాలనే విషవలయానికి పదార్థవాదం, వినియోగవాదాలలో ప్రతిబింబించిన మానవైక కేంద్రీకరణే(Anthropo Centrism) మూలకారణం. తను పుట్టిన, పెరిగిన ప్రాకృతావరణను తనతో కలుపుకు పోవడం మనిషి మరిచింది. అందుకే మానవవికాసం తిరోగమనం బాటపడ్తున్నది.
ఇప్పటికి సమస్త ప్రకృతిలో చివరగా పుట్టింది మనిషే. ఈ అఖండ భూమండలాన్ని అదుపులో పెట్టుకోవాలనే దుర్మార్గపు మనిషి కాంక్ష వినాశహేతువైంది. ప్రకృతి తన స్వభావాన్ని ఏం మార్చుకోలేదు. కాని, అసహజంగా మారిపోతున్నది మనిషే. పంచభూతాత్మకమైన, పాదార్థికమైన ప్రపంచం ఎప్పటిలెక్కన సహజంగానే వుంది. సముద్రాలు, పర్వతాలు, నదులు, భూగర్భఖనిజాలు, అడవులు సహజంగానే వున్నాయి. కాని, మనిషికి తానెవరో తెలియనితనమే ఇంకా ఉంది.
మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని గురించి తెలిపే
తొలి పర్యావరణ ఖండకావ్యం రుగ్వేదం దశమమండలంలోని 146వ సూక్తం ‘అరణ్యాని’.
ఈ ‘అరణ్యాని’సూక్తం దేవముని అనే రుగ్వేద రుషిప్రోక్తం.
ఈ రుక్కులలో ‘అరణ్యాని’ అంటే అడివి(దేవత).
‘అరణ్యాని కనిపించదు, గ్రామాన్ని కోరదు, దట్టమైన అడివంటే భయంలేదు. మిడతలు, కీచురాళ్ల చప్పుళ్ళలో ఆమె అందెల ధ్వనులు వినిపిస్తాయి. ఎవరో చెట్లు నరుకుతుంటారు. అడివి దుఃఖపడ్తుంది. తనను ధ్వంసం చేయనంతవరకు అరణ్యాని ఎవరికి హానిచేయదు... అడివిలోని మనిషి తియ్యటిపండ్లు తింటూ అడివిలోనే వుండడానికి ఇష్టపడ్డది. పరిమళ, సుగంధి ‘అరణ్యాని’ దున్నకుండానే పండిన బహు అన్నాలను మనకు అందిస్తుంది’.
ఇదొక సహజ కవితా సంకలనం. అడివి సహజ సుందరంగా వుంటుందని, తనకు హానిచేయనంతవరకు తానెవ్వరికి హాని చేయదని, అడివిలోని మనిషి అడివినే ఇష్టపడ్తుందని, దున్నకుండానే పలు ఆహారాలు అడివి అందిస్తుంది అని చెప్పడం మనిషి ప్రకృతికి కలిగించిన కష్టం గురించే. దున్నకుండానే పండించే వ్యవసాయం గురించి ‘గడ్డిపోచతో వ్యవసాయం’ చెప్పిందికదా.
సుద్దాల అశోక్ తేజ రాసిన అడివి ఆత్మకథ కవితాకావ్యం ‘నేను అడివిని మాట్లాడుతున్న’ అడివి గురించి రాసిన దీర్ఘకవితా కావ్యం. ఈ కావ్యంలో అడివి ప్రధాన కావ్యవస్తువు. రచనా ప్రక్రియ వచనకవిత. ఇంతకు ముందు శ్రమహాకావ్యం ‘శ్రమకావ్యం’ రాసిన అశోక్ ఇపుడు అడివిని గురించి కవిత్వం రాయడం సామయికం, ప్రాసంగికం. అడివికి నోరిచ్చి, ఆకుపచ్చనిభాష ఇచ్చి, మనుషులతో మాట్లాడించిన కవి అశోక్ గేయరూప, సంభాషణారూప కవిత్వంలో సంపన్నుడు.
సుద్దాల అశోక్ తేజ అడివితో...
‘‘నేను అడవిని మాట్లాడుతున్న
మేనిపచ్చల పుడమిని మాట్లాడుతున్న
ఆకులలముల కడలిని
పసరువాసనలు వీచే
ఉసురుకోశాల ఎడదను మాట్లాడుతున్న’’అని మాట్లాడించాడు. ఈ భూగోళానికి ఉసురుకోశాలైన అడవుల గుండె స్పందనలు మాటలుగా చేసాడు కవి.
‘నే నడవినే కాని ప్రకృతి
నుడిని నా‘నుడి’గా పాడుతున్న
ప్రకృతిమాట నానోట పలుకుతున్న’
భూమి మాట్లాడుతున్నది. భూమి గుండె అడివి మాట్లాడుతున్నది.
‘పర్యావరణ ప్రత్యేక ప్రతినిధిని
మాట్లాడుతున్న
మాన్యులకు, సా
మాన్యులకు, పాలక వ
రేణ్యులకు తెలియని
ఆకుపచ్చనిభాష వెలువరిస్తున్నా’’నంటున్నది అడివి.
అడివి ఇపుడెందుకు పర్యావరణ ప్రతినిధిగా మాట్లాడవలసి వస్తున్నది. ఏమైంది పర్యావరణానికి అని అడుగనవసరం లేనంత భగ్నమైంది ప్రకృతి. ఉద్విగ్నమైంది అడివి. మనసులోని తండ్లాటను వెల్లబోసుకుంటున్న అడివికి మాటలిచ్చిన కవి అశోక్. ఇది అడివి స్వగతం. ఆత్మగతం. ఆత్మకథనం.
ప్రకృతిపుడు ‘అడవిగాచిన వెన్నెలనే కాదు, అడివి కార్చిన కన్నీళ్ళను ఎదలో దాచిన దుర్బలను మాట్లాడుతున్న’ అంటున్నది దీనంగా. ఈ దీనావస్థను ప్రకృతికి కలిగించింది మనిషి దుర్మార్గతే. మనిషి ప్రకృతికేంద్ర జీవావరణం నుంచే కాదు తమ బాంధవ్యకేంద్ర జీవావరణం(Kin centric Ecology) నుంచి కూడా దూరమై, ఆత్మకేంద్ర (Self-centric)జీవిగా మారిపోయాడు. అందుకే కవి మనిషిని పునరుద్ధరించాలనే నిబద్ధతతో రాస్తున్న కావ్యం ‘నేను అడివిని మాట్లాడుతున్న’.
‘ఆదికవి క్షేత్రాన్ని, అడవి జనక్షేత్రాన్ని
ఆకుతెర ఛత్రాన్ని, అవని సిరాచిత్రాన్ని
సంతోష సూత్రాన్ని, సంగీతగాత్రాన్ని
పరిమళాలను పంచు ఫలపుష్ప పత్రాన్ని
నే నన్నసత్రాన్ని
నిరతాన్నసత్రాన్ని’...
క్రీ.పూ.1500నాటికే(తొలివేదకాలం) 4లక్షల వరిధాన్యం రకాలుండేవని సండే ఎక్స్ ప్రెస్ (2004 మే 30) రాసింది. ఛత్తీస్ఘర్ కేంద్ర వరిపరిశోధనా సంస్థ వీటిలో 20వేల రకాలను గుర్తించింది. ఎన్ని అన్నపురాసులు?
అడివి ఆదికవి వాల్మీకి పుట్టినచోటు. అడివి వనజనుల క్షేత్రం. ప్రకృతి పట్టిన ఆకుపచ్చని గొడుగు, భూమిమీద ప్రకృతి గీసిన రంగులబొమ్మ, మనిషికి స్వర్గసంతోషాలనిచ్చిన నందనవనం, అడివి సంగీతానికి గాత్రం, అడిగిన ఫలాలనిచ్చిన అరణ్యాని నిరతాన్నసత్రం. ఎందుకు మనిషి తను తినే అన్నంలో మన్నుపోసుకుంటున్నట్టు? ఎందుకు భూతలస్వర్గాన్ని భూతమై వేధిస్తున్నట్టు?
ఎందుకంటే ‘తల్లివేరును భూతల్లిగర్భంలోనే అల్లుకొని/అంటుపెట్టుకుని వుండే/ఏకైక కృతజ్ఞతా జాతిమాది /మట్టితల్లి పేగు ముడి తెగ్గోసుకోని/పుడమితల్లి బొడ్డుతాడు తెంపేసుకోని/వృక్షజాతి మాదొకటే..’ మనిషి కాదు అంటున్నది అడివి.
‘అనాగరికత కాదు, అరణ్యకత నాది
ఆటవికత కాదు ఆటవీయత నాది’ అనే అడివివంటిది కాదు మనిషి గుణం. మానవీయత కన్నా గొప్పది ఆటవీయత. మనిషి నాగరికత కన్నా గొప్పది అరణ్యకత.
‘నేల వేర్ల నుండి కొమ్మ తల కొసదాక
దాతృత్వమే ధన్యతగా జీవించే
బాధ్యతను నేను
బాధ్యతారణ్యాన్ని నేను’ అంటుంది అడివి...మరి ఏదీ మనిషి మనిషితనం? ఏది మనిషి ప్రకృతిపట్ల, సాటిమనుషుల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనం. చెట్లు వేర్లనుంచి కొటారుకొమ్మల రెమ్మలదాకా ప్రయోజనత్వం కలిగినవే. చెట్లు పరోపకారులు. ‘ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యాపి పరార్థాయ వృక్షా: సత్పురుషా: ఇవా’
‘తలపయి మండుటెండలను దాలిచి చల్లని నీడలిచ్చు పాం,
థులకు, కఠోరమౌ శిలలతో పడమోదిన పూలు కాయలున్
ఫలములొసంగు, ప్రాణములు బాసియు కాయము కోసి యిచ్చు నీ
యిల, నరజాతికిన్ తరువులే గురువుల్ పరమార్ధ బోధనన్’ అంటాడు జంధ్యాల పాపయశాస్త్రి. ‘శరీరమాద్యంఖలు ధర్మసాధన’మన్న నీతికలిగినవే. మనిషెందుకు ‘ఖలునకు నిలువెల్ల విషము’గా మారిపోయాడు?
కవి అశోక్
‘విత్తనగర్భంలో అంకురం, కనురెప్పలు విప్పే చప్పుడులో/మొక్కల ప్రసవానికి విత్తనాల/తనువు చిట్లే చప్పుడులో/ పుడమి తనలోని వృక్షాలకు/ పురుడుపోసే గడియ గడియ/పురిటినొప్పొచ్చి/కడుపువిచ్చుకునే చప్పుడులో/ఒక కరుణరసాత్మక శ్రుతిలయ/వింటాను ప్రతినిమిషం/‘మానిషాద శ్లోకం’లా/అనన్యమగు సంగీతం/ అరణ్యమొక సంగీతం’ మనల్ని కూడా తనతోపాటు అడివికి చెవియొగ్గి వినమంటాడు. అడివి నుంచి అపార కరుణను తెలుసుకోమంటాడు.
‘బతుకు
బతికించమనే సూత్రానికి
మానవతకు...జీవనలతకు
చివరికి నీవు నీకు
రాయిగా మారిన క
సాయివైనావు
ఏం మనిషివిరా నువ్వు’ అని కోపగిస్తాడు కూడా.
లక్షలాది యేండ్లనుంచి మానవజీవితం నిలదొక్కుకునేట్లు చేసిన వాతావరణంలో వచ్చిన దుర్గార్గపుమార్పు ప్రాకృతికమైన రుతువులలోని లయను చెరిపేస్తున్నది. తుఫాన్లు, వరదలు, వాతావరణస్థితి ఉపద్రవాలు లక్షలాది ప్రజలను ఇండ్లులేని వారిని చేస్తున్నాయి. శిలాజ ఇంధన కాలుష్యం కారుణంగా క్షయ, మలేరియా, ఎయిడ్స్ కంటే తీవ్రమైన వ్యాధులబారినపడి ఇటీవలికాలంలో ప్రతియేటా 90లక్షలమంది చనిపోతున్నారు. ప్రతి 4క్షీరదాలలో 1క్షీరదం మాయపోనున్నది. ఉభయచరాలలో పదింట 4 లేకుండా పోయేటట్లున్నది. ప్రకృతికి కలిగిన నష్టం ప్రపంచమంతా విస్తరించి జీవావరణవిధ్వంసానికి హేతువౌతున్నది.
‘‘భూ విముక్తి, స్త్రీ విముక్తి, మొత్తం మానవజాతి విముక్తికొరకే మనం పనిచేయాల్సివుంది. శాంతిని సృష్టించు కోవాల్సి వుంది మనం’’---అన్నది వందనా శివ. ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి, ఫెమినిస్టు మన తక్షణ కర్తవ్యాన్ని ఉద్బోధిస్తున్నది.
అందుకే అశోక్ తేజ
‘నీ స్వార్థావలంబనగా ఎప్పుడైతే నీ నాగరికత మార్చావో/అపుడే అరణ్య నేత్రాలకందనంత/లోలోతుల పాతాళానికి పడిపోయావు/ ఆస్ట్రేలియా ద్వీపంలో అరుదైన జీవరాశి/చరిత్రను చెరిపేసిన నర/చెదపురుగువు నీవేకద పైగా.../నీవల్లే అరుదైన మృగజాతి/అంతరించింది/ఏం మనిషివిరా నువ్వు/..మానవ ఆనకొండగా/ మారిపోతివెందుకురా/ఏం మనిషివిరా నువ్వు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
‘అఖిలసృష్టికి ప్రాణముద్ర ప్రకృతి/ప్రకృతికి వేలిముద్ర అడవి/అడవి నిలువెత్తు సంతకం చెట్టు/
ప్రకృతి మనిషి/అభేదం అద్వైతం’ అని తెలియనివాడా మనిషి? తెలిసికూడా సత్యాన్ని, మానవధర్మాన్ని పక్కనపెట్టి, తానొక సంపదల గోనెసంచిలెక్క మారిపోయాడు. సహజప్రకృతి సంపదలు కోల్పోయిన మనిషి కృత్రిమ ధనవంతుడైనాడు. శ్వేతవిప్లవం పేరిట ఆవులను సూదులతో సూడిదలు చేసి, కోడెలను నపుంసకంగా మార్చి, ఒంటెల రక్తపిపాసిగా మారి, ఆఖరికి పందిముక్కున ఆహారం పసికట్టే ఘ్రాణభాగాన్ని కోసి... ఎన్నెన్ని అఘాయిత్యాలను చేసాడీ మనిషి.
మనిషి ప్రకృతికి చేసిన ద్రోహాల జాబితాను వివరించాడు కవి. నిశితపరిశీలన, సమాచారానుశీలన, లోతైన అధ్యయనం లేకపోతే తాను ఇంత గొప్పగా రాయలేక పోయేవాడు. పర్యావరణ ఉద్యమానికి దోహదంగా జెండా ఎత్తిన కావ్యమిది.
అడివిలో జీవించే వనజీవులంటే మైదానప్రాణి మనిషికి చులకన. తను నాగరికమని, వనజీవి అనాగరికమని, తాను అన్నీ తెలిసినదాన్నని, వనజీవి శుద్ధ మొద్దు అని దురభిప్రాయం తనది.
‘కోయ, కోయి, కోయతారంటె/గోండు భాషలో మనిషి అని../ఎవడురా నా బిడ్డలు అడవి జంతులని/ ఓండ్రపెట్టేది?/క్రూరమృగపదముద్రికా/భాష మొదట కనుగొన్న/మర్మయోగులు నా బిడ్డలు
పెద్దపులి వాసన ఏదో/కాళిఖుంటా పువ్వాసన ఏదో/ఉగ్గుపాల బుగ్గలనాడే/నిగ్గుతేల్చగలడు నా అడవిబిడ్డ’
మనిషిచెమట/ఎద్దుచెమట/మట్టిచెమట ముప్పేటగా/మరిగితే/పెరిగేది పైరనీ/నమ్మిన వాడు అడవిబిడ్డ’ అంటాడు సుద్దాల అశోక్ తేజ.
నిజంగా అడివిజనులు గొప్పవారు. వాళ్ళకు ప్రకృతే సమస్తం.
‘‘(సవర) గిరిజనులకు అడివే దేవత...
మావి చెట్టొక దేవతా మర్రిచెట్టొక దేవతా
చింత చెట్టొక దేవతా జీల్గు చెట్టొక దేవతా
దేవతా దేవతా అన్ని చెట్లు దేవతా
పెద్దకొండొక దేవతా చిన్న కొండొక దేవతా
చెట్లకొండొక దేవతా రాళ్ళకొండొక దేవతా
దేవతా దేవతా అగ్నికొండలు దేవతా
మింటిపై నొక దేవతా గాలిలో నొకదేవతా
మంటిపై నొకదేవతా నీటిలో నొక దేవతా
దేవతా దేవతా అన్ని దిక్కుల దేవతా’’
(సవరల పూజపాటలు, గిడుగు వేంకట సీతాపతి)
ఈ పాట రుగ్వేదంలోని అరణ్యసూక్తం కన్న తక్కువైనదేమీ కాదు. అడివిని ఎంత ప్రేమిస్తున్నారో తెలిపే పాట ఇది. ఈ అడివిని ధ్వంసంచేసే అధికారం ఎక్కడిది మనిషికి? అడివికి హక్కులున్నాయంటాడు కవి. అడివిహక్కుల పోరాటానికి మద్ధతు పలుకుతున్న హక్కులవకీలు సుద్దాల అశోక్ తేజ.
‘‘ప్రకృతికొక రాజ్యాంగం ఉంది
ఒక అదృశ్య అసీమిత చట్టం ఉంది
ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఉన్నై’’ అంటాడు. ‘నగరీకరణంటే అడివిని నరికేయమనా/ప్రపంచీకరణమంటే మానవేతర/ప్రపంచాన్ని నాశనం చేయమనా’ కాదంటాడు కవి. ‘ఏ ప్రగతి అయినా సరే/పర్యావరణానికి పాదుగా ఎదగాలి/కార్పొరేట్ కాలకూట/విషపు చేదులాకాదు కద’ అని హితబోధ చేస్తాడు అశోక్. పెట్టుబడి పెరిగినకొద్ది ప్రకృతి కుంచించుకు పోతుంది. మార్కెట్ పెరుగుదల అది సృష్టించే సంక్షోభాన్ని మాన్పలేదు కదా.
‘మనం వివేకం నుంచి విషయపరిజ్ఞానానికి మారిపోయాం, తెలియడం నుంచి సమాచారానికి కదిలిపోతున్నాం. ఈ సమాచారమనేది పాక్షికం. దానితో మనం అసంపూర్ణ మానవుల్ని సృష్టిస్తున్నాం’ అంటుంది వందనాశివ.
మనుషుల అరాచకత్వానికి పౌరాణిక రాక్షసులను ప్రతీకలుగా తీసుకొని భూమిని చాపగా చుట్ట ఆక్రమించిన హిరణ్యాక్షుని, సీతను చెరపట్టిన రావణుని లెక్క ‘గాలిముక్కును కాలుష్యపు ముసుగులో కట్టేసే’, భూమిని విషపదార్థాలతో నింపేసే నరావణుల, నరారణ్యాక్షుల్ని శిక్షించాలని కవి కోరుతున్నాడు.
‘న్యాయదేవతలకే దేవత
ప్రకృతి సత్యపీఠిక’
ప్రకృతి న్యాయాలయం ముందు
ఎవడురా ముద్దాయి
నరుడే కదా పర్యావరణ విద్రోహి
హంతకులు మీరే
హతులు మీరే’నంటాడు. పర్యావరణానికి ద్రోహం చేసింది మనిషే. మనిషి హంతకబుద్ధికి బలైంది మనిషేనాయె. ప్రకృతికోర్టులో సత్యపీఠం మీద నిల్చునే ముద్దాయి మనిషే. అన్నీ తెలిసిన సత్యాలే. అన్నీ తెలిసిన శిక్షలే. అయినా మనిషి మారడాయె.
‘మీ భావజాల వైరస్సే/మృత్యు వైరస్, కారకులు, వాహకులు/పీడకులు, పీడితులూ మీరే, శవతాండవం చేయిస్తున్న వైరసులకు/ మీ భావజాలమే గర్భసంచి,/ బహుళ(జాతి)కంపెనీల రాస్తాలోంచి/ పుట్టుకొచ్చిన మృత్యుపటాలమే కదా వైరస్’... ఈ రెండోతరంగం కరోనా ప్రపంచాన్ని కుదుపేసింది. మునుపెన్నడు లేనివిధాన శవాల ఊరేగింపులు తీస్తున్నది. మనిషి అభివృద్ధిని అపహాస్యం చేస్తున్నది. మనిషి ఉన్నతశిఖరాలను అధిరోహించినాడని చెప్పుకునే విశేషాలెన్నివున్నా... అప్రతిహతంగా కొనసాగుతున్న పతనాలంతకన్నా లెక్కకు ఎక్కువే.
అందుకే కవి రచన ఇపుడు ప్రాసంగికం (Relevant) అయింది.
‘పెట్టుబడికి ప్రకృతిని తాకట్టుగా పెడితే ఎలా
పెట్టుబడికి రాజ్యం కట్టుబానిసైతే ఎలా…
దోపిడిపద్ధతి మార్చిన/పెట్టుబడి సూత్రమొకటె/కొనిపించు, కొనిపించు, కొనిపించనే మంత్రం
ఆ వ్యాపారవర్గమే రాజ్యాంగేతర శక్తిగా అనధికార పదవీస్వీకారం చేసింది. అధికారపదవుల్లో ఊరేగే బొమ్మలు కట్టుబానిసలైన నాయకమ్మన్యులకు ‘కీ’పర్సన్ బడా, బడా వ్యాపారికదా.
అడివి గౌతముని బుద్ధుణ్ణి చేసింది, (మల్లోజుల)ని గణపతిని చేసింది. ఇద్దరు మానవులు వారి వ్యూహాలను రచించిందిక్కడే. ఇది తులనాత్మక అధ్యయనం చేయవలసిన సంగతి.
అడివిని వంచించి ఆక్రమించుకున్న మనిషి చేసిన శత్రువతనం(శత్రుత్వం) మీద రణం చేయాల్సి వస్తున్న ప్రస్తుత సందర్బంలో కవి సుద్దాల అశోక్ తేజ రాయబారి కృష్ణుని అవతారం ఎత్తి, మహాభారతేతిహాసంలోని సంఘటనను ఆధునీకరించి, ఈ కావ్యంలో భాగం చేస్తున్నాడు. పౌరాణిక ప్రతీకలను వాడడం తన ‘శ్రమకావ్యం’లో కూడా చూడగలం. ఈ కావ్యంలో మనిషికీ, ప్రకృతికి సంధి కుదుర్చాలని దూతగా మాట్లాడుతున్నానంటాడు కవి. తెగబడిన మనిషి సంధికియ్యంబడడు. ఇంగితజ్ఞానం ఎపుడో పోయింది. ఇపుడు తనది ధనం భాష. స్వార్థం శైలి. అమానుష రీతి. దూతగా కవి చేయవలసిన సంధి విన్నపాలన్నీ చేసాడు. చివరికి ఈ పోరులో హతులు, హంతకులు మీరే. మిమ్మల్ని హెచ్చరించడానికే ఈ కావ్యం ‘సృజామ్యహమ్’ అంటున్నాడు.
పురాణప్రతీకల సాయంతో ఈ కావ్యాన్ని నడిపించాడు కొన్ని అధ్యాయాల్లో...ముఖ్యంగా కవి రాయబారం. ‘అడివిదూతగా మాట్లాడుతున్న సంధి కొడంబడవేని జరుగబోయే విపత్కర పరిణామాలు విను’, ‘అరణ్య అజాతశత్రువే అలిగిననాడు...స్వార్థరాజేంద్రులు చత్తురు, నా మాటలు నమ్ము, విపన్నుల లోకులగావు మెల్లరన్’ కవి కవిత్వ రాయబారం నెరపుతున్నాడు... ప్రకృతికి ప్రాణం లేదనుకున్నవారు ప్రాణాలతో వుండరు...అది హెచ్చరిక.
సుందర్లాల్ బహుగుణ నిన్నటిదాకా అడివిని కాపాడడానికి జీవితకాలాన్ని వెచ్చించాడు. చిప్కో ఉద్యమనేత. చెట్లను నరకకుంట వాటిని కౌగిలించుకుని అడ్డుపడే త్యాగాన్ని అడివినాశ్రయించి జీవించే ప్రజలకు, ముఖ్యంగా స్త్రీలకు నేర్పాడు. అడివి యాదికుంచుకుంటది బహుగుణను. మనిషి యాదికుంచుకోవాలె బహుగుణను. ఏది కాపాడుకోవాలో, మనిషిని కాపాడే నిజమైన రక్షణ ఎక్కడుందో చెప్పాడు సుందర్ లాల్.
సుద్దాల అశోక్ తేజ కూడా ‘నేను అడివిని మాట్లాడుతున్న’ అనే ఈ ఆధునిక పర్యావరణోద్యమ కావ్యాన్ని ‘Biophilia’తో రచించాడు. ప్రకృతంటే అపారమైన ప్రేమ, మానవజీవనం మీద మమకారంతోనే ఈ రచన చేసాడు. ఈ కావ్యం పర్యావరణ చేతనను సృజిస్తున్నది. ఇటువంటి సాహిత్యం సామాజికచేతనలో స్పందనలు కలిగిస్తుంది. మనిషి, ప్రకృతి మధ్య వుండే సంతోషస్వాంతాలు, సాంత్వనలు చెరిగిపోకుండ చూస్తుంది.
అంతా అడివినుంచే తీసుకున్న మనిషి తిరిగి చెల్లించింది ఎంత? ప్రకృతి వినాశనం. అందుకే కవి
‘చెట్టు చెట్టుకో
ఆధార్ కార్డ్
అడవి అడవికి ఒక
ఆరోగ్యశ్రీ అని
మీ చట్టసభల్లో పెట్టరేంటి’ అని నిలదీస్తున్నాడు.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం 2020 జూలై 1నాటికి వాతావరణ దుష్పరిణామాలకు బాధ్యులుగా తమ తప్పిదాలకుగాను 38దేశాలు 1550కేసులు ఎదుర్కుంటున్నాయి. ఈ భూమ్మీద నుంచి Ecocideను నిర్మూలించడానికి
‘వాలెరి కాబనెస్’ (భూమ్మీద పర్యావరణధ్వంసాన్ని అరికట్టాలి) అనే నినాదంతో అత్యున్నత పర్యావరణవేత్తలు, నిపుణులు, న్యాయవాదులతో కూడిన ‘Stop Ecocide Foundation’ అనే ఒక అంతర్జాతీయకమిటి ఏర్పడ్డది. పర్యావరణ న్యాయసూత్రాలను పాటించని మానవచర్యే జీవావరణధ్వంసానికి హేతువని, మనుషులతో సహా సకలజీవుల సమతుల్య జీవనానికి హానికరమని నిర్వచింపబడ్డది. అయినా ఇంకా ఐక్యరాజ్యసమితి జీవావరణధ్వంసాన్ని అంతర్జాతీయంగా శిక్షార్హనేరంగా అంగీకరించలేదెందుకో?
భూగ్రహంమీద మానవజాతికి ప్రకృతికి మధ్య ప్రాథమికంగా మానవకేంద్రం కాని సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని గౌరవించినపుడే తీసుకోదగిన చర్యలకు మార్గదర్శనమవుతుంది. ప్రకృతిహక్కులను గుర్తించాలి. భౌమికన్యాయపరిధికి రాజ్యాంగాలు, స్థానిక న్యాయాలు, జాతీయ చట్టాలు రావాలి. దీనికనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు చేయాలి.
సుద్దాల అశోక తేజ
‘నేను అడవిని మాట్లాడుతున్న, మేనిపచ్చల పుడమిని మాట్లాడుతున్న’ అంటూ కావ్యారంభం చేయడంలోనే ఆలంకారికశైలి వుంది. తీసుకున్న కావ్యవస్తువుకు కావ్యగుణాన్ని తేవడానికి ప్రయోగించిన పదజాలం, కొత్త సమాసాల సృష్టి అపూర్వం. త్రిశ్ర,చతురస్ర, ఖండగతులతో తనదైన గేయఫణితి అడుగడుగునా కనిపిస్తుంది. రాగఛ్చాయ నిండిన రచన.
‘నేను ప్రకృతిని/సస్యశ్యామలాకృతిని/ సౌందర్య సహృదయ సమలంకృతిని’... తనకిష్టమైన ప్రాసక్రీడల తాండవం అంతటా నిండివుంది. ఒక మాటను పాటలో పల్లవి వచ్చినట్లు పలుమార్లు ఉల్లేఖించడం ద్వారా చెప్పదలచుకున్న విషయాన్ని నొక్కి వక్కాణించినట్లవుతుంది. దీనికి ఉల్లేఖనాలంకారమని పేరుపెట్టొచ్చు.
‘రాళ్ళకూ శిలభాషవుంది
నీళ్ళకో జలభాషవుంది
మూగమట్టికి ఉట్టిపడే భూభాష ఉంది...
నింగికీ ఖ భాష వుంది’...
అనితరమైన భాషలను పేర్కొంటున్నాడు కవి. ప్రకృతి ప్రతిదానికి భాష వుందంటాడు కవి. రాళ్ళకు, నీళ్ళకు, మట్టికీ భాషలున్నాయి. ఆకాశానికి ఖ(=నింగి)భాషట... చిన్నప్పుడు ఇతరుకలు తెలువకుండా కొన్ని రహస్యభాషలను మాట్లాడేది. వాటిలో ‘క’భాష ఒకటి.. ‘కభాకష’ అన్నమాట. ఎన్ని తలపుకు వస్తాయో ఈ కావ్యం చదువుతుంటే. అన్ని లైవ్ లీ వుండేవే.
‘విత్తనగర్భంలో అంకురం, కను/రెప్పలు విప్పే చప్పుడు’ను వినగలిగా డీ కవి. ‘జాలువారి కాలువగా/ మారిన సలిలానిదొక లయ’ అనగలిగాడు.
అందుకే అడివితో ఆత్మగతంగా మాట్లాడించాడు, అడివి ఆత్మతానై మాట్లాడాడు కవి. అడుగడుగునా ఆటవిక నిసర్గ రమణీయ సౌందర్యాన్ని కీర్తిస్తూ అనన్యసామాన్యంగా రాస్తూపోయాడు కవి అశోక్.
‘ఆకాశంలో ఒక్కడే సూర్యుడు అరణ్యాన
మంచునీటిబిందువులు నిలిచిన ప్రతి ఆకు ఆకుకో సూరీడు
నా పత్రసముద్రాలలో ఎన్ని సూర్యదీపాలో’.
అడివికిపోతే తప్ప కలుగదు అనుభవం. అడివి తెలిస్తే తప్ప అర్థంకాదీ కవి రచన.
‘అమృతసంతానం’లో గోపీనాథ్ మొహంతి(అను:రోణంకి అప్పలస్వామి) వర్ణించినట్టు అడివిబిడ్డ తనకు తానే పురుడుపోసుకునే ఘట్టాన్ని
‘నెలత తనే
నెలతప్పిన సతి తానే
గర్భవతి తానే కాబోయే తల్లితానే, ఒంటరిగా
అడవిలో తన పురుడు తనే పోసుకునే
మంత్రసాని కూడా తానే నా అడవిబిడ్డ’ ‘నెలత తనే’ అనే ఖండికలో ఇట్లా అశోక్ తేజ రాసాడు.
అడివిబిడ్డల ప్రాకృతిక జ్ఞానాన్ని, జీవన సందర్భాలలో మెలకువలని, సాహసవంతమైన జీవితానల్ని వర్ణిస్తూ గొప్పగా రాసిన ‘ఎవడురా నా బిడ్డలు, నెలత తనే’ అనే రెండు ఖండికలు ఈ కావ్యానికే హైలైట్స్.
అశోక్ తేజ ప్రతిరచనలో కొత్తపదాలను సృజిస్తుంటాడు. కవికి తన పదకోశం తనకు వుండనే వుంటుంది. కాని, ఈ కవి కొత్త పదాలతో ఆశ్చర్యపరుస్తుంటాడు.
‘చిగురుసాగు, ఆకులలములకడలి, జలశౌర్య/వీర్య/ధైర్య, భూవారసత్వం, అటవీయత, అరణ్యకత, బాధ్యతారణ్యం, వజ్రధూళిజలం, సరళ విశాలంగా (సరళ విరళంగా), గర్భవీణ, తొడిమెఅమ్మ’ కొత్తగా వున్నాయి కదా.
పచ్చనిచెట్లే ఈ భూమికి ఆకుపచ్చనికావ్యమని, జీవావరణవిధ్వంసం నుంచి భూగోళాన్ని కాపాడాలని ప్రపంచమంతటా కవులు కవిత్వం రాసారు.రాస్తున్నారు. పోయిన 2020 డిసెంబరులో కల్చరల్ సెంటర్ ఆప్ విజయవాడ అండ్ అమరావతి ఆధ్వర్యంలో అంతర్జాల అంతర్జాతీయ బహుభాషా పర్యావరణ కవిత్వ కవి సమ్మేళనం’ జరిగింది. 32 దేశాల నుంచి 42 భాషల్లో 165మంది కవులు పాల్గొన్నారు. కవులకు పర్యావరణ స్పృహ పెరిగింది. బాధ్యత తెలిసింది. పాతకవులు, కొత్తకవులు ప్రకృతిని వర్ణించనివారు అరుదు. ఇపుడా ప్రకృతిని కాపాడుకోవాలనే ‘బాంధవ్య పర్యావరణ’ వాదులు కోరుకుంటున్నారు.
సమాజాన్ని కదిలించే శక్తి సాహిత్యానికి ఉందని నమ్మిన కవి సుద్దాల అశోక్ తేజ. తానీ కావ్యం రాయడం బాధ్యతగా భావించి రచించాడు. తనలోని పర్యావరణ చేతనే అడివిని ఆవహింపజేసుకుని ఆత్మగతానుగతమైన కావ్యం రాయించింది.
కోట్లయేండ్ల చరిత్రున్న భూమ్మీద 5సార్లు జీవకోటి మాయమైపోయింది.6రోసారి కూడా తప్పదేమో. ప్రతిరోజు వందల జీవజాతుల మనికి లేకుండా పోతున్నది. దీన్ని అర్థం చేసుకోవాలంటూ స్వీడన్ పార్లమెంటు ముందర గ్రేటాథన్ బెర్గ్ అనే పదిహేనేండ్ల బాలిక తెలిపిన నిరసన, ఆక్రోశమే ‘నేను అడివిని మాట్లాడుతున్న’ కావ్యంలో ఉన్నది.
ఎందరో కవులు, రచయితలు తమబాధ్యతగా పర్యావరణ సోయి కోరి రాస్తున్నారు. రాబిన్సన్‌ జెఫర్స్‌, మేరీ ఆలివర్‌, డబ్ల్యూ. యస్‌. మెర్విన్‌, వెండెల్‌ బెర్రీ, లిండా హోగన్‌ వంటి పలువురు పర్యావరణ కవులు, కవయిత్రులు తమ కలాలే ఆయుధాలుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. ప్రకృతిని, స్త్రీలను కాపాడాలని పోరాడే ‘ఇకో-ఫెమినిస్టులు’న్నారు. మనదేశంలోని ఈశాన్యప్రాంత కవులు మమాంగ్ దాయి, జానిస్ పరయాట్, నసాన్మొంగి, జాస్మిన్ పాటోన్, మిత్రాఫుకాన్, మోనాలిసా చంగ్కిచా, రేష్మి నర్సరీ, తెమ్సుల ఆయో, ఎస్తరిన్ కైర్ వంటివారు ప్రకృతిపట్ల అపారమైన ప్రేమతో కవిత్వం రాసారు.
సుద్దాల అశోక తేజ కూడా అడివిమీద అనంతమైన ఇష్టంతో, మమకారంతో ఈ కావ్యం రాసాడు. ఈ దేశానికొక హరితరాజ్యాంగం డిమాండు చేస్తున్నాడు. చెట్టు,చెట్టును గుర్తించాలని, అడవి, అడవిని కాపాడాలని చట్టసభల్లో తీర్మానించమని ప్రజాస్వామికంగా కోరుతున్నాడు. రాజ్యాంగంలో వాతావరణాన్నీ, అరణ్యాన్నీ వన్యజీవుల్ని రక్షించమనీ ఆదేశిక సూత్రాలలో రాసినవే కదా అని గుర్తుచేస్తున్నాడు.
‘‘బీళ్ళలో అడవులను నాటే మనసుగల ఒక చేయికోసం
అడివిని
దత్తుగైకొనే దయగల్ల
ఒక హృదయం కోసం
అడవిని పోషించే ప్రభుత్వం కోసం’’ కవి నిరీక్షిస్తున్నానంటున్నాడు.
‘ఏ పరిశోధనైనా
ఏ పురోగమనమైనా
అరణ్యం అంగీకరించే
పర్యావరణం పరవశించే’ విధంగా నేటితరాలకు అభయంగా, రేపటితరాలకు భరోసాగా వుండాలంటున్నాడు అశోక్ తేజ. ‘బ్రింగ్ ద నేచర్ బ్యాక్’ అన్నది కవి నినాదం. ప్రకృతికి చెల్లించే కృతజ్ఞతారూపకంగానే మనుషులుండా లంటాడు. పత్రహరిత పుష్పభరిత, ఫలసమేత జనరక్షిత ప్రకృతికి, అడవితల్లికి తాను చరణచారణ చక్రవర్తినంటూ కావ్య ఫలశ్రుతి వినిపించాడు కవి. తాను అడవితల్లి చరణచారణ చక్రవర్తినని సవినయంగా కావ్యాన్ని సమర్పిస్తున్నాడు.
-----హరగోపాల్

29, జూన్ 2014, ఆదివారం

పిట్టగూడు
ఎంత ఇష్టం ఎపుడూ
వెతుక్కోవడం
దొరికి కనుమరుగయ్యే కాలం
కాంతుల్ని
ఎవరి కన్నుల్లోనో వెన్నెలనిధులుగా
తిరిగి దాచిపెడ్తుంటాం కదా
చేతులు చాచి అట్లనే నిలబడివున్నా
సముద్రం అలల్ని నీదాకా విసిరినట్టే విసిరి
వెనక్కి మోసుకుపోతుంది
జ్ఞాపకాలే ఎగిసిపడుతుంటాయి
స్నేహంతో పరిమళభరితమైన గాలి తాకి వెళుతుందిె
మెత్తని మనసులో ఎవరో తనపాదం పెట్టి
పిట్టగూడు కట్టిపోతారు
సింగిడిని, కన్నీళ్ళతో తడిసిన
ఇన్ని గులాబీలను అక్కడ వొదిలిపోతారు నవ్వుతూ
ఎవరికోసమేనని ఎన్నిసార్లు
మేఘాలమీద మెరుపుకవితలు రాస్తుంటారు
అత్తిపత్తి మరుపులు అవసరమేనేమొ
దాటిపోయే మాటలు సంచిలో కుక్కు
గుండెలో నాటివున్నముచ్చట్లను
దారినిండా పరిచినడిచిపొమ్మను ఎవరినైనా
అది వాళ్ళిష్టం
ఆరుద్రపురుగు లెక్క కార్తెకొక్కసారే
రావాలనిపించినవి వొస్తాయి, మాయమైపోతాయి
సున్నితంగా, సుకుమారంగా
సంధ్యలవొంతెన మీద
రాకపోకలు వెలిగించో, మలిగించో
రెప్పలువాల్చని నిరీక్షణల నిశ్శబ్దపు చిత్రాలు
రాలుతున్న మల్లెపూల లెక్క
ఎవరిచూపులో నీకు గొడుగుపడుతుంటాయి
పాటలు దారిపొడుగునా
ఎక్ ప్యార్ కా నగ్మా హై
మౌజోంకా రవానీ హై
27.06.2014
L

2, సెప్టెంబర్ 2013, సోమవారం

కలవని...


నిన్ను కనుగొన్నపుడే నన్ను నేను కోల్పోయాను
తప్పించుకోలేని, దాచుకోలేని, ఆపుకోలేని
ప్రేమ నిషిద్ధఫలం కాదని తెలుసుకున్నాను
తలపుల తలుపులు అవే తెరుచుకున్నాయి

మీటల్లేని మనసుల వొంతెనలపై దిక్దిగంబరంగా
ఎడమెరుగని మోహం, ఎడతెగని సంభాషణలు
గుండెలొక్కటిగా రెండు శ్వాసలొక్క వూపిరిగా
కలివిడిగానే కాక వొంటరిగా జీవించలేనితనం

గాలి వేలికొసలతో నువు నన్ను తాకినట్లే
పాట గానాలతో నువు నన్ను చేరినట్లే
నా ప్రాణాలు నీ చుట్టు కాంతిపరివేషాలై
నిను ముట్టుకోగానే మాయమై నీలోకి నేను
(వేసవి- 2013)

17, ఆగస్టు 2013, శనివారం

జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
పచ్చగడ్డిచీరగట్టి, చేనుచెల్కల నగలువెట్టి,
మొగులు సిగలో సుట్టుకోనీ
వాగువంకాలయ్యి పారిందో నా తెలంగాణా
పాడిపంటాలయ్యి నవ్విందో నా తెలంగాణా

పల్లెపడుసూలంత గూడి పాడియాడిన పల్లెసుందరి
బతుకమ్మా ఆటలెక్కుందీ నా తెలంగాణా
దసరపండుగ జండలెక్కుందీ నా తెలంగాణా
మూడుజాములకాడ లేశి మోటకొట్టాబోయినట్టి
మొగిలయ్యా పాటలెక్కుందీ నా తెలంగాణా
మోటబొక్కెన ఆటలెక్కుందీ నా తెలంగాణా

బురుదపొలముల వంగివంగీ నాట్లేశిన రామక్కా
అందమైనా చెయ్యిలెక్కుందీ నా తెలంగాణా
నారుకట్టా నవ్వులెక్కుందీ నా తెలంగాణా
పాలయాళ్ళకు ఉరికొచ్చే అమ్మకాళ్ళ కింద నలిగిన
పిల్లతొవ్వా బాటలెక్కుందీ నా తెలంగాణా
సేపులొచ్చిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా

చేనుకోశి కుప్పకొట్టి, వడ్లు దంచి వండుకొచ్చిన
కొత్తన్నం బువ్వలెక్కుందీ నా తెలంగాణా
కొత్తచెలిమె నీళ్ళలెక్కుందీ నా తెలంగాణా
రేగుపండ్లు,మేడిపండ్లు,పరికిపండ్లు కలింకాయలు
జానపండ్ల తీపిలెక్కుందీ నా తెలంగాణా
దుంపగడ్డల గంపలెక్కుందీ నా తెలంగాణా

పుట్టినప్పటి సంది నేను గిట్టి మట్టిల కలిసెదాకా
జోలపాడిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా
ఓలలూపిన అవ్వలెక్కుందీ నా తెలంగాణా
బిడ్డలంతా ఒక్కటయ్యి పొరుబాటల సాగి ముందుకు
తల్లిరుణమూ తీర్చుకొమ్మందీ నా తెలంగాణా
వీరులయ్యీ పోరుసెయమందీ నా తెలంగాణా
-హరగోపాల్

మంచివాన వాన వాన వానవాన వానావానా
వాన వాన వానవాన వానావానా
 నన్ను నిన్ను మనల కలిపి బతికించే వాన
అందరి కడుపులకు మెతుకు కనిపెంచిన వాన

 గుప్పుమన్న మట్టిగుండె పరిమళాలవాన
కప్పుకున్న నేలపచ్చ పచ్చడాలవాన
మావూరికి తరలివచ్చు పెళ్ళిగుంపువాన
మీవూరి మొగులు మీద నీటిగొడుగు వాన
 నింగి నేల కలిపి పాడు నీటివీణ వాన
పొంగిపొరలు నదుల ఎదల సంగీతం వాన

వరిపొలాల పంటగొలుసు మురిపించే వాన
తరతరాల మానవసంస్కృతికి జాడ వాన
 మూగబాసలెన్నో మాటలైన వాన
మనసుగాలి మళ్ళగానె తొణుకులాడు వాన
కలలవసంతాలు నేల దిగివచ్చిన వాన
కలకాలం మనుషుల్లో మంచితనం వాన (
(అముద్రితం-2004) 15-08-13

20, ఏప్రిల్ 2013, శనివారం

నువ్వు   నేను

ఆకాశానికి నేనే స్వప్నరజాన్ని కలిపి నీలి రంగులద్దింది
నిరీక్షణల బంగారు చుక్కల్ని పచ్చబొట్లుగా పొడిచింది నేనే
నీ నవ్వుల వెన్నెల చంద్రరేఖల్ని అక్కడ అద్దింది నేనే
రాత్రిని కలల శయ్యగా ఊపిరి రాగాలతో శ్రుతి చేసింది మాత్రం నువ్వే

పువ్వు పువ్వును తిరిగి పుక్కిటపట్టిన తొలితేనె చినుకుల్ని నేనే
గాలివూయెలలో వూగుతున్న జ్గాపకాల పరిమళాల్ని నేనే
కడలి అలల పలవరింతల్లో నదులసంగమ కావ్యశీర్షిక నేనే
సింగిడి రంగుల మధువు ఒంపి నన్ను గజళ్ళుగా గానం చేసింది మాత్రం నువ్వే

కోయిలల్ని పిలిచి వసంతకవితాకచేరి చేయించింది నేనే
కన్నీళ్ళగిన్నెల్లో ఇంత సాంత్వన నింపి మనసు ఆకళ్ళు తీర్చబోయింది నేనే
రెండు గుండె దరుల మధ్య అనంతంగా జాలువారే ఆత్మీయత నడిగింది నేనే
రాత్రిందివాల నడుమ వెచ్చని అనునయానివై అలరిస్తున్నది మాత్రం నువ్వే