20, ఏప్రిల్ 2013, శనివారం

నువ్వు   నేను

ఆకాశానికి నేనే స్వప్నరజాన్ని కలిపి నీలి రంగులద్దింది
నిరీక్షణల బంగారు చుక్కల్ని పచ్చబొట్లుగా పొడిచింది నేనే
నీ నవ్వుల వెన్నెల చంద్రరేఖల్ని అక్కడ అద్దింది నేనే
రాత్రిని కలల శయ్యగా ఊపిరి రాగాలతో శ్రుతి చేసింది మాత్రం నువ్వే

పువ్వు పువ్వును తిరిగి పుక్కిటపట్టిన తొలితేనె చినుకుల్ని నేనే
గాలివూయెలలో వూగుతున్న జ్గాపకాల పరిమళాల్ని నేనే
కడలి అలల పలవరింతల్లో నదులసంగమ కావ్యశీర్షిక నేనే
సింగిడి రంగుల మధువు ఒంపి నన్ను గజళ్ళుగా గానం చేసింది మాత్రం నువ్వే

కోయిలల్ని పిలిచి వసంతకవితాకచేరి చేయించింది నేనే
కన్నీళ్ళగిన్నెల్లో ఇంత సాంత్వన నింపి మనసు ఆకళ్ళు తీర్చబోయింది నేనే
రెండు గుండె దరుల మధ్య అనంతంగా జాలువారే ఆత్మీయత నడిగింది నేనే
రాత్రిందివాల నడుమ వెచ్చని అనునయానివై అలరిస్తున్నది మాత్రం నువ్వే