2, సెప్టెంబర్ 2013, సోమవారం

కలవని...


నిన్ను కనుగొన్నపుడే నన్ను నేను కోల్పోయాను
తప్పించుకోలేని, దాచుకోలేని, ఆపుకోలేని
ప్రేమ నిషిద్ధఫలం కాదని తెలుసుకున్నాను
తలపుల తలుపులు అవే తెరుచుకున్నాయి

మీటల్లేని మనసుల వొంతెనలపై దిక్దిగంబరంగా
ఎడమెరుగని మోహం, ఎడతెగని సంభాషణలు
గుండెలొక్కటిగా రెండు శ్వాసలొక్క వూపిరిగా
కలివిడిగానే కాక వొంటరిగా జీవించలేనితనం

గాలి వేలికొసలతో నువు నన్ను తాకినట్లే
పాట గానాలతో నువు నన్ను చేరినట్లే
నా ప్రాణాలు నీ చుట్టు కాంతిపరివేషాలై
నిను ముట్టుకోగానే మాయమై నీలోకి నేను
(వేసవి- 2013)

17, ఆగస్టు 2013, శనివారం

జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
పచ్చగడ్డిచీరగట్టి, చేనుచెల్కల నగలువెట్టి,
మొగులు సిగలో సుట్టుకోనీ
వాగువంకాలయ్యి పారిందో నా తెలంగాణా
పాడిపంటాలయ్యి నవ్విందో నా తెలంగాణా

పల్లెపడుసూలంత గూడి పాడియాడిన పల్లెసుందరి
బతుకమ్మా ఆటలెక్కుందీ నా తెలంగాణా
దసరపండుగ జండలెక్కుందీ నా తెలంగాణా
మూడుజాములకాడ లేశి మోటకొట్టాబోయినట్టి
మొగిలయ్యా పాటలెక్కుందీ నా తెలంగాణా
మోటబొక్కెన ఆటలెక్కుందీ నా తెలంగాణా

బురుదపొలముల వంగివంగీ నాట్లేశిన రామక్కా
అందమైనా చెయ్యిలెక్కుందీ నా తెలంగాణా
నారుకట్టా నవ్వులెక్కుందీ నా తెలంగాణా
పాలయాళ్ళకు ఉరికొచ్చే అమ్మకాళ్ళ కింద నలిగిన
పిల్లతొవ్వా బాటలెక్కుందీ నా తెలంగాణా
సేపులొచ్చిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా

చేనుకోశి కుప్పకొట్టి, వడ్లు దంచి వండుకొచ్చిన
కొత్తన్నం బువ్వలెక్కుందీ నా తెలంగాణా
కొత్తచెలిమె నీళ్ళలెక్కుందీ నా తెలంగాణా
రేగుపండ్లు,మేడిపండ్లు,పరికిపండ్లు కలింకాయలు
జానపండ్ల తీపిలెక్కుందీ నా తెలంగాణా
దుంపగడ్డల గంపలెక్కుందీ నా తెలంగాణా

పుట్టినప్పటి సంది నేను గిట్టి మట్టిల కలిసెదాకా
జోలపాడిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా
ఓలలూపిన అవ్వలెక్కుందీ నా తెలంగాణా
బిడ్డలంతా ఒక్కటయ్యి పొరుబాటల సాగి ముందుకు
తల్లిరుణమూ తీర్చుకొమ్మందీ నా తెలంగాణా
వీరులయ్యీ పోరుసెయమందీ నా తెలంగాణా
-హరగోపాల్

మంచివాన వాన వాన వానవాన వానావానా
వాన వాన వానవాన వానావానా
 నన్ను నిన్ను మనల కలిపి బతికించే వాన
అందరి కడుపులకు మెతుకు కనిపెంచిన వాన

 గుప్పుమన్న మట్టిగుండె పరిమళాలవాన
కప్పుకున్న నేలపచ్చ పచ్చడాలవాన
మావూరికి తరలివచ్చు పెళ్ళిగుంపువాన
మీవూరి మొగులు మీద నీటిగొడుగు వాన
 నింగి నేల కలిపి పాడు నీటివీణ వాన
పొంగిపొరలు నదుల ఎదల సంగీతం వాన

వరిపొలాల పంటగొలుసు మురిపించే వాన
తరతరాల మానవసంస్కృతికి జాడ వాన
 మూగబాసలెన్నో మాటలైన వాన
మనసుగాలి మళ్ళగానె తొణుకులాడు వాన
కలలవసంతాలు నేల దిగివచ్చిన వాన
కలకాలం మనుషుల్లో మంచితనం వాన (
(అముద్రితం-2004) 15-08-13

20, ఏప్రిల్ 2013, శనివారం

నువ్వు   నేను

ఆకాశానికి నేనే స్వప్నరజాన్ని కలిపి నీలి రంగులద్దింది
నిరీక్షణల బంగారు చుక్కల్ని పచ్చబొట్లుగా పొడిచింది నేనే
నీ నవ్వుల వెన్నెల చంద్రరేఖల్ని అక్కడ అద్దింది నేనే
రాత్రిని కలల శయ్యగా ఊపిరి రాగాలతో శ్రుతి చేసింది మాత్రం నువ్వే

పువ్వు పువ్వును తిరిగి పుక్కిటపట్టిన తొలితేనె చినుకుల్ని నేనే
గాలివూయెలలో వూగుతున్న జ్గాపకాల పరిమళాల్ని నేనే
కడలి అలల పలవరింతల్లో నదులసంగమ కావ్యశీర్షిక నేనే
సింగిడి రంగుల మధువు ఒంపి నన్ను గజళ్ళుగా గానం చేసింది మాత్రం నువ్వే

కోయిలల్ని పిలిచి వసంతకవితాకచేరి చేయించింది నేనే
కన్నీళ్ళగిన్నెల్లో ఇంత సాంత్వన నింపి మనసు ఆకళ్ళు తీర్చబోయింది నేనే
రెండు గుండె దరుల మధ్య అనంతంగా జాలువారే ఆత్మీయత నడిగింది నేనే
రాత్రిందివాల నడుమ వెచ్చని అనునయానివై అలరిస్తున్నది మాత్రం నువ్వే