17, ఆగస్టు 2013, శనివారం

జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
జై తెలంగాణా

ఎంత అందంగా ఉన్నాదో నా తెలంగాణా
ఎన్ని ముద్దులొలుకుతున్నాదో నా తెలంగాణా
పచ్చగడ్డిచీరగట్టి, చేనుచెల్కల నగలువెట్టి,
మొగులు సిగలో సుట్టుకోనీ
వాగువంకాలయ్యి పారిందో నా తెలంగాణా
పాడిపంటాలయ్యి నవ్విందో నా తెలంగాణా

పల్లెపడుసూలంత గూడి పాడియాడిన పల్లెసుందరి
బతుకమ్మా ఆటలెక్కుందీ నా తెలంగాణా
దసరపండుగ జండలెక్కుందీ నా తెలంగాణా
మూడుజాములకాడ లేశి మోటకొట్టాబోయినట్టి
మొగిలయ్యా పాటలెక్కుందీ నా తెలంగాణా
మోటబొక్కెన ఆటలెక్కుందీ నా తెలంగాణా

బురుదపొలముల వంగివంగీ నాట్లేశిన రామక్కా
అందమైనా చెయ్యిలెక్కుందీ నా తెలంగాణా
నారుకట్టా నవ్వులెక్కుందీ నా తెలంగాణా
పాలయాళ్ళకు ఉరికొచ్చే అమ్మకాళ్ళ కింద నలిగిన
పిల్లతొవ్వా బాటలెక్కుందీ నా తెలంగాణా
సేపులొచ్చిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా

చేనుకోశి కుప్పకొట్టి, వడ్లు దంచి వండుకొచ్చిన
కొత్తన్నం బువ్వలెక్కుందీ నా తెలంగాణా
కొత్తచెలిమె నీళ్ళలెక్కుందీ నా తెలంగాణా
రేగుపండ్లు,మేడిపండ్లు,పరికిపండ్లు కలింకాయలు
జానపండ్ల తీపిలెక్కుందీ నా తెలంగాణా
దుంపగడ్డల గంపలెక్కుందీ నా తెలంగాణా

పుట్టినప్పటి సంది నేను గిట్టి మట్టిల కలిసెదాకా
జోలపాడిన అమ్మలెక్కుందీ నా తెలంగాణా
ఓలలూపిన అవ్వలెక్కుందీ నా తెలంగాణా
బిడ్డలంతా ఒక్కటయ్యి పొరుబాటల సాగి ముందుకు
తల్లిరుణమూ తీర్చుకొమ్మందీ నా తెలంగాణా
వీరులయ్యీ పోరుసెయమందీ నా తెలంగాణా
-హరగోపాల్

మంచివాన వాన వాన వానవాన వానావానా
వాన వాన వానవాన వానావానా
 నన్ను నిన్ను మనల కలిపి బతికించే వాన
అందరి కడుపులకు మెతుకు కనిపెంచిన వాన

 గుప్పుమన్న మట్టిగుండె పరిమళాలవాన
కప్పుకున్న నేలపచ్చ పచ్చడాలవాన
మావూరికి తరలివచ్చు పెళ్ళిగుంపువాన
మీవూరి మొగులు మీద నీటిగొడుగు వాన
 నింగి నేల కలిపి పాడు నీటివీణ వాన
పొంగిపొరలు నదుల ఎదల సంగీతం వాన

వరిపొలాల పంటగొలుసు మురిపించే వాన
తరతరాల మానవసంస్కృతికి జాడ వాన
 మూగబాసలెన్నో మాటలైన వాన
మనసుగాలి మళ్ళగానె తొణుకులాడు వాన
కలలవసంతాలు నేల దిగివచ్చిన వాన
కలకాలం మనుషుల్లో మంచితనం వాన (
(అముద్రితం-2004) 15-08-13