20, ఏప్రిల్ 2013, శనివారం

నువ్వు   నేను

ఆకాశానికి నేనే స్వప్నరజాన్ని కలిపి నీలి రంగులద్దింది
నిరీక్షణల బంగారు చుక్కల్ని పచ్చబొట్లుగా పొడిచింది నేనే
నీ నవ్వుల వెన్నెల చంద్రరేఖల్ని అక్కడ అద్దింది నేనే
రాత్రిని కలల శయ్యగా ఊపిరి రాగాలతో శ్రుతి చేసింది మాత్రం నువ్వే

పువ్వు పువ్వును తిరిగి పుక్కిటపట్టిన తొలితేనె చినుకుల్ని నేనే
గాలివూయెలలో వూగుతున్న జ్గాపకాల పరిమళాల్ని నేనే
కడలి అలల పలవరింతల్లో నదులసంగమ కావ్యశీర్షిక నేనే
సింగిడి రంగుల మధువు ఒంపి నన్ను గజళ్ళుగా గానం చేసింది మాత్రం నువ్వే

కోయిలల్ని పిలిచి వసంతకవితాకచేరి చేయించింది నేనే
కన్నీళ్ళగిన్నెల్లో ఇంత సాంత్వన నింపి మనసు ఆకళ్ళు తీర్చబోయింది నేనే
రెండు గుండె దరుల మధ్య అనంతంగా జాలువారే ఆత్మీయత నడిగింది నేనే
రాత్రిందివాల నడుమ వెచ్చని అనునయానివై అలరిస్తున్నది మాత్రం నువ్వే

2 కామెంట్‌లు:

  1. My Soul

    Flying submarine...my soul
    I swam in, heartfully, deepened seas
    for getting to your waves...

    what launched me to skies?
    what trenched me to bermudas!

    kept everything out,
    to breath your feelings
    walked along the deserts,
    with sweated feet...

    you brought me up..
    into weary, teary clouds
    of melancholy whispers ....
    of the stories stored
    of the dreamy dreams

    O ye, curtain of morning stars!
    gift of the nights,
    a song of eternity,
    a boomarang of my entity!?

    రిప్లయితొలగించండి
  2. ఒక్క పెదవి ఒత్తిగిలి
    మాట మాత్రంగా గొంతు సవరింపు
    ఒక్క గాత్రస్పర్షతో
    కోటి జీవనరాగాల మేళవింపు
    గాఢమైన నిశ్శబ్దం తర్వాత
    పువ్వు విప్పుకుంటున్న మెత్తని సవ్వడి
    ఎంత విచిత్రంగా చాచిన చేతుల్లో దోసెడు చెన్నైమల్లెలు
    కరువుదీరా పరిమళాలు నా లోపల బయటా
    తడిసి తడిసి చిత్తడిగా మనసు
    ......... ......... ........

    అలసటగా వుందిరా, ఎంత దూరం ఈ పయనం
    తెలిసినవి తెలియనట్లు, తెలియనివి తెలిసినట్లు
    నమ్మినవన్ని వమ్మయ్యాక నమ్మకం మీద నమ్మకం పోయింది
    ఒక్కరోజు కూడా నిరాశ ఎరుగని బతుకులో
    ఎవరో కనికట్టు కట్టారు

    మాటలు మంత్రాలుగా మాయల గాయాలపాలు
    సంతోష సముద్రాలింకిపోయాయి
    నిరీక్షణల కన్నీటిప్రవాహాలు
    రక్తనాళాల్లో జలపాతాలై

    నీకేమయినా తెలుసా
    నాతో పాటు నాలోపలికి
    వచ్చిన అతిథి ఎవరో...

    రిప్లయితొలగించండి